అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వారి అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పని చేస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించిన 30 రోజుల్లోనే ఈ ప్రాంత ప్రజలు తనను అక్కున చేర్చుకొని ఆదరించి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. టీడీపీ పార్టీ విజయానికి పనిచేసిన ప్రతి కార్యకర్తకు వారి సంక్షేమానికి అండగా ఉంటామన్నారు. ఎన్నికల ముందు తమను ఓడించటానికి ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు తనపై లేనిపోని ప్రచారాలకు దిగినప్పటికీ పార్టీ నాయకులు కార్యకర్తలు తనను ఆదరించాలన్నారు. పార్టీ కార్యకర్తలకే కాక ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను దేవుడు తనకు ఇంకా ఇచ్చాడని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం అభివృద్ధికి మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తమ పైన తమ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు నారాయణతో పాటు ఎంకే చౌదరి సంపత్ కుమార్ బద్రవలి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.