తిరుపతి జిల్లా, తిరుమల : టీటీడీ ఈవో శ్యామల రావు ఐఏఎస్., జేఈఓ వెంకయ్య చౌదరి ఐఏఎస్., జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., టిటిడి సివిఎస్ఓ శ్రీధర్ ఐపీఎస్., వారు మరియు ఇతర అధికారులు శ్రీవారి ఆలయ మాడవీధులు, వసంత మండపం, గ్యాలరీలు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తదితర ప్రాంతాలలో విస్తృతంగా పరిశీలించి, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు ప్రణాళికను సమిష్టిగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు మాట్లాడుతూ.. భక్తుల తాకిడి ఎంత ఉన్న అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి అత్యవసర వాహనాల రాకపోకలకు అనువుగా ఏర్పాట్లు చేయాలని. ఎలాంటి తోపులాటకు తావు లేకుండా పటిష్టమైన బారికేడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి గ్యాలరీలను అనుసంధానిస్తూ క్యూలైన్ల ఏర్పాటు.. వాటిని తెలియపరుస్తూ సూచిక బోర్డులు కచ్చితంగా ఉండాలని, పార్కింగ్ ఏరియాలను తెలియజేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు లో సూచిక బోర్డులు ఏర్పాటు, అలిపిరి టోల్గేట్ వద్ద ప్రతి ఒక్కరిని ప్రతి వాహనాన్ని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతి ఇవ్వాలని, స్థానిక బాలాజీ నగర్ లో నివాసముంటున్న వారి వివరాలను సరిచూసుకొని, ఎవరైనా కొత్తవారు ఉంటే సమగ్రంగా విచారించాలని, చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో టాగింగ్ తప్పనిసరి గా ఉండాలని సంబంధిత శాఖలకు సూచనలు చేసారు. అలాగే భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ఇంచార్జ్ అదనపు ఎస్పి శ్రీ వెంకట్రావు, తిరుమల డి.ఎస్.పి విజయ శేఖర్, సిఐలు, ఎస్సైలు, టీటీడీ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.