కరీంనగర్ జిల్లా: ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీల్లో రోడ్లు,డ్రైనేజీ పనులు చేపట్టేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గా నికి ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన పది కోట్ల రూపాయలతో ఎస్సీ కాలనీల్లో పనులు చేపట్టాలని, ఇందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని కోరారు. షెడ్యూల్డ్ కులాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక రూపొందించిందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వందశాతం పూర్తి స్థాయిలో వెచ్చించి పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడా నికి వీలుగా చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన అధికారు లను కోరారు.ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజినీర్లు రవి ప్రసాద్, మంజుభార్గవి,ఏఈలు సురేందర్ రెడ్డి (తిమ్మాపూర్), వెంకన్న(మానకొండూర్), మల్లేశం (శంకరపట్నం), స్నేహజ్యోతి (గన్నేరువరం), సమ్మయ్య ( బెజ్జంకి), అజహర్ (ఇల్లంతకుంట) తదితరులు పాల్గొన్నారు.