contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల స్వస్తి .. కవ్వంపల్లి సవాల్

కరీంనగర్ జిల్లా: పోలీసుశాఖ లో పోస్టింగ్ ల పేరిట తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించగలిగితే రాజకీయాలను నుంచి వైదొలుగుతానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల సీఐ పోస్టింగ్ కోసం తాను 20 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డాక్టర్ కవ్వంపల్లి డిమాండ్ చేశారు. నిరూపించలేకుంటే ఇక ముందు తప్పుడు ఆరోపణలు చేయకుండా నోరుమూసుకొని ఉండాలని, లేకుంటే తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. ఓటమిని జీర్ణించుకోలేని బాలకిషన్ బట్టకాల్చి మీదేసే విధంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సెక్రటేరియట్ కు వెళ్లేది నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించుకోవడానికే తప్ప బాలకిషన్ మాదిరిగా డబ్బుల కోసం పైరవీలు చేయడం లేదన్నారు. వరదల సమయంలో తాను గ్రామాల్లో పర్యటించానని, తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే మత్స్యకారుడు వాగులో కొట్టుకుపోయిన ప్రదేశాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించి గాలింపు చర్యలు ముమ్మరం చేయించానని, రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో వరద తాకిడికి గురైన గ్రామాలను సందర్శించామన్నారు. ఇవాళ మృతుడు లక్ష్మయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేసినట్టు ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. వరదల వేళ తాను హైదరాబాద్ కే పరిమితమైనట్టుగా రసమయి సాగించిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

సీపీతో వైరం లేదు

కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో తనకు ఎలాంటి వైరం లేదని, సీపీ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని
మంచి చేస్తే సమర్థిస్తానని, చెడు చేస్తే వ్యతిరేకిస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు.
కమిషనరేట్ పరిధిలో దళిత సీఐ పోస్టింగ్ ల విషయంలో సీపీ వైఖరిని మాత్రం తప్పుపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గానికి చెందిన నలుగురు సీఐలను జాయిన్ కాకుండా సీపీ వెనక్కి పంపించారన్నారు. సీఐలు కిరణ్, రవి కుమార్, రమేష్, సదన్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారేనని, తమ జాతి బిడ్డలపై జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పాల్సి వచ్చిందన్నారు. దళిత సీఐలు కష్టపడి పోస్టింగ్ లు తెచ్చుకుంటే సీపీ తిప్పి పంపడం, ఐజీ ఉత్తర్వులు సైతం ధిక్కరించి సీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి, డీజీ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రసమయి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని సీఐ గా నియమించుకోగా, ఇప్పుడు తాను దళిత సామాజికవర్గానికి చెందిన సీఐలు ఉండాలని కోరుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పోస్టింగుల కోసం లెటర్లు ఇచ్చి డబ్బులు తీసుకునే వారని, కాంగ్రెస్ పాలనలో మాత్రం ఆ సంస్కృతికి చరమగీతం పాడామన్నారు.

నోరు తెరిస్తే బాగుండదు కౌశిక్

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కల్లుతాగిన కోతిలా చిందులు వేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు.ఈ వ్యవహారానికి ఫోన్ ట్యాంపింగ్ ను ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నోరు తెరిస్తే బాగుండదని ఆయన కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. మీ చరిత్రలు తెలియందెవరికి అని ఆయన ప్రశ్నించారు. ఎస్ ఐలు, సీఐల దగ్గర పండుగలు, పబ్బాల పేరుతో పొట్టేళ్ల తెప్పించుకొని దావతులు చేసుకొనే కౌశిక్, రసమయిలు సుద్ద పూసల్ల మాట్లాడటం విడ్డూరంగా ఉందని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు.

అక్రమ కేసులు లేవు..

బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు, బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బందుల పాల్జేసేవారని డాక్టర్ కవ్వంపల్లి ఆరోపించారు. మానకొండూర్ నియోజవర్గంలో అనేక మందిపై ఈ తరహా కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, అలాగే అక్రమ కేసులు నమోదు చేయడం లేదన్నారు. గులాబీ నేతలు, కార్యకర్తలపై ఏమైన కేసులు నమోదై ఉంటే అవి వారు చేసిన తప్పుడు పనులు వల్ల నమోదైనవే తప్ప బనాయించిన తప్పుడు కేసులు ఎంతమాత్రం కావని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :