- కొత్తపట్నం తీర ప్రాంతాలను నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
- నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
- ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జిల్లా ఎస్పీ.
- ఎవరైనా నిమజ్జనాలలో చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు.
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం: వినాయక చవితి ఉత్సవాల అనంతరం విగ్రహా నిమజ్జనాల దృష్ట్యా జిల్లాలో నిమజ్జనాలు అధికంగా జరిగే కొత్తపట్నం తీర ప్రాంతాలను ఆదివారం జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి సందర్శించి అక్కడ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సజావుగా సాగిపోయేందుకు వీలుగా తీరంలోని పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రత్యేక ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియచేసారు.
విగ్రహాల నిమజ్జనాలలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు సంభవించకుండా అన్ని చర్యలు చేపట్టాలని, నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు చేసేలా చూడాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రించాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నిమజ్జన సమయంలో భక్తులు ఎక్కువ లోతుకు వెళ్లకుండా, చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా చూడాలని, నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు మొదలైనవి ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. గజఈతగాళ్ల కు జిల్లా ఎస్పీ ప్రత్యేకమైన టీ షర్ట్ లను అందజేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియకు పోలీసు శాఖపరంగా అన్ని భద్రత మరియు బందోబస్త్ చర్యలు తీసుకున్నామని, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులతో పాటు మెరైన్ పోలీసులను సేవలందిస్తారని, గజఈతగాళ్లను నియమించి, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచామని, నిమజ్జనాలలో చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వినాయక చవితి సందర్బంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు ప్రతిష్టించుకున్న విగ్రహాలను కాలువలు, చెరువులు, నదుల వద్ద నిమజ్జనం చేసే ప్రాంతాలను ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు ముందుగానే గుర్తించి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలిపారు.
జిల్లా ఎస్పీతోపాటు ఏ ఎస్ పి (అడ్మిన్) కె.నాగేశ్వర రావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్, మెరైన్ ఎస్సై సుబ్బారావు మరియు సిబ్బంది ఉన్నారు.