- చెప్పిందొకటి- ప్రచారం మరొకటి
- కేసుల మాఫీకే కొందరి కొత్త నాటకం
- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారంనాడు పత్రికలకు ఒక ప్రకటన జారీచేశారు. కరీంనగర్ సీపీ పై తాను చేసిన ఆరోపణలపై కాకుండా చేయని ఆరోపణలను చేసినట్టుగా దుష్ప్రచారం సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పై చేసిన ఆరోపణలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన,ఇద్దరు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని MZO – 100,154,259/2024 ద్వారా సిఐలు గా పోస్టింగులు తెచ్చు కుంటే వారిని చేర్చుకోకుండా సీపీ వెనక్కి పంపించింది నిజం కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా మానకొండూరు సిఐగా పోస్టింగ్ తెచ్చుకున్న ఆఫీసర్ పై సీపీ వ్యవహరించిన తీరు బాధించిందని ఆయన పేర్కొన్నారు. త్రీ మెన్ బోర్డు సమావేశం జరగలేదని సదరు సిఐ ని చేర్చుకోకుండా తిప్పి పంపించిన సీపీ బోర్డు మీటింగ్ జరిగిన తరువాత బోర్డు మీటింగ్ సిఫారసు ప్రకారం రెండోసారికూడా తనను కలడానికి కూడా సుముఖత చూపించకుండా ఎందుకు తిప్పి పంపించారని ప్రశ్నించారు. సీఐలుగా పోస్టింగులు తెచ్చుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురుని విధుల్లో చేర్చు కోకుండా కరీంనగర్ సీపీ ఉద్దేశపూర్వకంగా తిప్పి పంపించారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఆరోపించారు. సీపీ వైఖరి వల్ల తన సామాజిక వర్గానికి చెందిన వారికి అన్యా యం జరుగుతున్నదని తాను గళం విప్పాల్సి వచ్చిందని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. సిపి పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ జిల్లా నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న కొందరు వీడియోలు ,ఆడియోలు విడుదల చేయడం మరీ విడ్డూరంగా ఉందని డాక్టర్ సత్యనారాయణ విమర్శించారు. అరెస్టు నుంచి కేసుల నుంచి బయట పడేందుకు విషయాన్ని వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు.