ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదివారం నాడు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతం జక్కంపూడిలో పర్యటించారు. సీఎం తో పాటు జేసిబీ పై వెళ్లి వరద ముంపు బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా జగన్ చేస్తున్న వ్యాఖ్యల పై మంత్రి ఘాటుగానే స్పందించారు…
బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుని వరదలపై జగన్ చేస్తున్న బురద రాజకీయం వెగటు పుట్టిస్తోంది. వైసీపీ తీరు మారకపోతే .. జగన్ .. ఆయన పార్టీ కూడా బుడమేరు బురదలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఎనిమిది రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వ సహాయ చర్యలతో ప్రజలు ఊరట పొందుతున్నారు. ప్రజలు ప్రభుత్వ చర్యలను మెచ్చుకోవడాన్ని చూడలేని జగన్… విషపు ఆలోచనలతో వికృత ప్రచారం చేస్తున్నాడు.
అయ్యా రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది … లేనిది ప్రతిపక్షమేనని జనం గుర్తించారన్న విషయాలన్ని జగన్ గుర్తించాలి. ప్రజల్లో ఆకలి మంటలు కాదు … ప్రభుత్వ చర్యలతో పరిస్థితులు చక్కబడుతున్నాయనే నీ కడుపుమంట మీ ప్రకటనల్లో కనిపిస్తోంది. పార్టీ ఉనికి కోసం ట్విట్టర్ లో రెట్టలు మాని …. నువ్వు పార్టీ నుంచి విరాళంగా ప్రకటించిన రూ.1 కోటి సాయం ఏమయ్యిందో చెప్పు? ఇంకా ఎందుకు ప్రభుత్వానికి జమచేయలేదో చెప్పు? ఒక వేళ బాధితులకు ఇచ్చి ఉంటే ఆ వివరాలు ప్రకటించు. లేదంటే అది కూడా ఫేక్ అని ఒప్పుకుని క్షమాపణ చెప్పు. చేతనైతే ప్రజలకు సాయం చేయాలి తప్ప ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు సరికాదని మంత్రి హితవు పలికారు.