వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవoగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూ లైన్ నియంత్రణ, కంట్రోల్ రూం ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపు లు ఏర్పాటు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం, త్రాగు నీరు, విద్యుత్తు సరఫరా లో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని, ఫైర్ సేఫ్టీ, భారీ కేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర అంశాలపై ప్రణాళిక బద్దంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీ ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సదుపాయం కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు రాజేంద్ర, రవి మనోహర చారి, జిల్లా దేవదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, టెంపుల్ ఈ ఓ శ్రీనివాసులు రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు.