మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘాంగంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి స్థానిక ఐలమ్మ విగ్రహాన్ని పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ..
విప్లవ ధ్రువతార ఐలమ్మ:
మెరిసే విప్లవ ధ్రువతార.. దొ రల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైంది. తొలి భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజ యం సాధించింది. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.
చాకలి ఐలమ్మ పోరాట నేపథ్యం :
ప్రస్తుత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ-సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగయ్య ,లక్ష్మీనర్సయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమనర్సమ్మ జన్మించింది.
కాగా, 1921లో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఆంధ్రజన సంఘం మారిన పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. 1944లో భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యంతో భూమి, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయి. ఈ మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసింది.
పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలుకు తీసుకొని పండించిన పంట పొలాలపై విస్నూరు దేశ్‌ముఖ్ కిరాయి గూండాలు దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్న క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. కిరాయి రౌడీలను తరిమి కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలో రజాకార్లు ఐలమ్మ ఇంటిని తగులబెట్టి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆమె కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడగా, పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది అమరులు కాగా, మొత్తంగా 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. చివరకు 1985 సెప్టెంబర్ 10న ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది. కాగా, పాలకుర్తిలో ఐలమ్మ స్మారక భవనాన్ని ప్రజలిచ్చిన విరాళంతో సీపీఎం పార్టీ నిర్మించగా, అది నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఉదండపురం నాగరాజు, మాజీ వార్డు సభ్యులు గుండారపు శ్రీనివాస్, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు ముక్కా దశరథ, జగదీష్ గౌడ్, పెరుమల రమేష్, తదితరులు పాల్గొన్నారు.