క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లో వంద కోట్ల రూపాయలను చిన్న పరిశ్రమలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధికి రూ.900 కోట్లు అందుతాయని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడానికి, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా టీసీఎస్ రూపొందిస్తున్న ఎంఎస్ఎంఈ వన్ యాప్ ను రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిన్న పరిశ్రమల కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్ఎంఈ పార్కుల చొప్పున 50 పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల డేటా బ్యాంక్ కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (రాంప్) కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వంలో టెక్నాలజీ సెంటర్ ను కొప్పర్తికి మార్చారని, దాన్ని తిరిగి అమరావతికి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికన డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ (డీఎఫ్వో) కార్యాలయం హైదరాబాద్ లో ఉండటంతో ఎంఎస్ఎంఈలకు అనుమతుల కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తోందని, అందుకే విజయవాడలో డీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని సీఎం చంద్రబాబు తెలిపారు.