ఏపీలో మళ్లీ జంపింగ్ జపాంగ్ లు ఎక్కువయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీని విడిచిపెట్టడానికి చాలా మంది సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీడీపీలో చేరగా..మరికొందరు జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి 24గంటలు పూర్తి కాక ముందే జనసేనలో చేరుతున్నారు మాజీ మంత్రి, ఒంగోలు జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం విజయవాడ నోవాటెల్ లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో బాలినేని భేటీ అయ్యారు. ఇక బాలినేని జనసేనలో చేరికపై మరికొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుంది. ఒంగోలు కీలకనేతతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఉదయభాను రేపు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.వైసీపీకి చెందిన ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు మరికొందరు కూడా జనసేనలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మరికొందరు పవన్ కల్యాణ్ కు సన్నిహితుల ద్వారా రాయభారం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఆ కీలక నేత కూడా..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అధికారం చేజారిపోవడంతో పాటు వైసీపీలో అధినాయకుడి తీరు నచ్చక అసంతృప్తితో ఉన్నవారు..గతంలో పదవులు ఆశించి నిరాశపడిన వాళ్లు కూడా ప్రస్తుతం టీడీపీ, జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈలిస్టులో ఒంగోలు నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ పవన్ కల్యాణ్ తో మంతనాలు జరుపుతున్నారు. ఇక ఇదే బాటలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఉన్నారు. అయితే ఉదయభాను కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఈ రూట్లో పవన్ కు దగ్గరై..పార్టీలో చేరాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పదవులు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తుంటే ..పదవులు అనుభవించిన వారిలో మరికొందరు గతంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దాడులు చేస్తుందనే భయంతో కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు.బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉదయభాను మాత్రమే కాదు మరికొందరు కూడా జనసేనలో చేరేందుకు పక్కాగా స్కెచ్ వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సామినేని ఉదయభాను మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కు వెళ్లారు. ఇవాళ లేద రేపు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోవడం ఖాయమని తెలుస్తోంది.