- ఆరు పథకాలతో ప్రజలకు చేరువ
- ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
- ఆ కమిటీల్లో కార్యకర్తలు చోటు దక్కించుకోవాలి
- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సమాయత్తమయ్యేలా ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం గాంధీభవన్లో పార్టీ జిల్లాల అధ్యక్షులు,జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో పార్టీ స్థితిగతులు, రాష్ట్రంలో 9 నెలల కాంగ్రెస్ పాలన పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారంతా తమ తమ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ, సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కావాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.
ఆరు పథకాల హామీలో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందేలా పార్టీ కార్యకర్తలు నాయకులు చూడాలని ఆయన కోరారు. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందలేని కుటుంబాలను గుర్తించి వారితో సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేయించాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో చేపట్టబోతున్నారని, ఇక నుంచి గ్రామస్థాయిలో ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని,ఆ కమిటీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు చోటు దక్కించుకునేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఇందిరమ్మ కమిటీల్లో స్థానం పొందడం వల్ల గ్రామంలో అర్హులైన వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం లభిస్తుందని, తద్వారా ప్రజలకు, పార్టీ కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.