హైదరాబాద్ : ర్యాలీలలో డీజే, టపాసులు వాడటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరంలో డీజేల విషయంలో త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తామని డీజీపీ జితేందర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో… నగర సీపీ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ… డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వీటితో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.
డీజే శబ్దాలు ఎక్కువ అవుతుండటంతో గుండె అదురుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీలో విపరీతంగా డీజే నృత్యాలు చేస్తున్నారని, పబ్బుల్లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లోనూ చేస్తున్నారని తెలిపారు. డీజే శబ్దాలను కట్టడి చేయాలని చాలా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. అందుకే వివిధ వర్గాలను సమావేశానికి ఆహ్వానించినట్లు చెప్పారు.
అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. నివేదికను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీజే శబ్దాలను అదుపు చేయకుంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, బీఆర్ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.