- ఏపీలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలుస్తాం
- విద్యుత్ పెట్టుబడిదారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి .
అమరావతి: విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ దృష్టికి తీసుకుని వచ్చిన అన్నీ సమస్యలను కచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల కోసం 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నారని, ఈ విషయం గతంలోనే గుజరాత్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించినట్లు గుర్తు చేశారు. దీనిలో భాగంగానే పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ముందడుగు పడిందని తెలిపారు. ఈ సమావేశంలో పెట్టుబడిదారులు లేవనెత్తిన జనరేషన్ బేస్డ్ ఇన్సెన్టీవ్స్ (జీబీఐ), లేట్ పేమెంట్ సర్ చార్జ్ (ఎల్పీఎస్), ట్యాక్స్ పాస్ థ్రూ (టీపీటీ), క్యాపాసిటీ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ (సీయూఎఫ్) తదితర సమస్యలపై మంత్రి మాట్లాడుతూ.. వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు .
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఏపీ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ పాలసీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, న్యాయస్థానాల్లో ఉన్న వ్యాజ్యాలతో పాటు పెట్టుబడిదారులు ఎదుర్కొన్న అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమగ్రంగా సమీక్షించి పారిశ్రామికవేత్తలకు అనుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు.
గత ఐదేళ్ల తరువాత మొట్టమొదటి సారి విద్యుత్ ఉత్పత్తి దారులతో కూటమి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం పై పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన భరోసా, భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు మనోధైర్యాన్ని నింపిందని వివిధ కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు.