లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటు కరెంట్ బిల్లులను నమోదు చేయని తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిబ్బంది ఇప్పుడు ఇంటింటికీ తిరిగి బిల్లులను తీస్తుండగా, వాటిని చూసిన వారు షాక్ నకు గురవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు గత సంవత్సరం అదే నెలలో నమోదైన బిల్లును చెల్లించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ కోరగా, లక్షలాది మంది బిల్లులు చెల్లించారు కూడా.ఇక ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే… మార్చి తొలి వారంలో బిల్స్ తీసిన తరువాత, జూన్ నెల ఆరంభం వరకూ మీటర్ రీడింగ్ లను తీయని విద్యుత్ శాఖ, ఇప్పుడు వచ్చి రీడింగ్ ను చూసి బిల్లులను జారీ చేస్తోంది. మూడు నెలల కరెంట్ బిల్లుకు సంబంధించిన మొత్తాన్ని ఒకే బిల్లులో ఇస్తోంది. దీంతో యూనిట్లు పెరిగిపోయి, స్లాబ్ లు మారిపోయి, అన్యాయమైన భారం వినియోగదారులపై పడుతోంది. “నేను గత సంవత్సరం బిల్లులను చూసి ఈ సంవత్సరం బిల్లులను చెల్లించాను. మూడు నెలల బిల్లులనూ కలిపి నాకు రూ. 6,390 బిల్లు ఇప్పుడు జారీ చేశారు. నేను ముందుగా కట్టిన డబ్బును మినహాయించిన తరువాత కూడా వేలల్లో బిల్ వచ్చింది. ఇది నాకు చాలా భారమే” అని పీఎస్వీ రావు అనే వ్యక్తి ట్వీట్ చేశారు. “ఒకే ఇన్ వాయిస్ లో మూడు నెలల బిల్లును జారీ చేయడం సరికాదు. చాలా మంది వినియోగదారుల శ్లాబ్ లు మారిపోతున్నాయి” అని శరత్ అనే మరో వ్యక్తి వాపోయారు. ఈ విషయంలో విద్యుత్ అధికారుల వాదన మాత్రం వేరేలా ఉంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉన్నారని, ఎంతో మంది ఇంటి నుంచి పని చేశారని, ఈ కారణంతోనే విద్యుత్ వినియోగం పెరిగి శ్లాబ్ లు మారాయని అంటుండటం గమనార్హం. నెలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న వారందరి ఇళ్లలోనూ మూడు నెలల బిల్ ఇన్ వాయిస్ లో 200 యూనిట్లకు పైగా విద్యుత్ ను వాడినట్టు చూపుతుండగా, యూనిట్ చార్జ్ రెట్టింపు చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.