మెదక్ జిల్లా తూప్రాన్: మాసాయిపేట లో పత్రిక సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు యాదగిరి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేస్తామని, ఈ విషయంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని నిండు అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేయక పోవడంతో రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకిగా మారాడని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ లేకపోవడంతో మాదిగలకు, ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలన్నారు. వర్గీకరణ అమలు చేయకపోతే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమ ఉధృతం కాకముందే ప్రభుత్వం దిగి రావాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.