జగిత్యాల జిల్లా,కోరుట్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లాలోని మూడు నియోజకవర్గాలలోని మూడు గ్రామ పంచాయతీలు, మూడు మునిసిపాల్టీలలోని మూడు వార్డులను ఎంపిక చేసి డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో ఆయా కుటుంబాల్లో పుట్టిన వారి లేదా మరణించిన వారి వివరాలు ఎంట్రీ చేస్తున్నారు. 3వ తేదీన ప్రారంభమైన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే, 8వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ అన్ని రకాల సేవలను ఒకే కార్డు ద్వారా అందించడానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకువచ్చిందని, పైలెట్ సర్వే ఎంపిక చేసిన గ్రామాలు, మున్సిపల్ వార్డులో జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి యూనిక్ నంబర్ ఇవ్వడం జరుగుతుందని, దాని ద్వారానే ప్రభుత్వం అందించే ఎలాంటి సంక్షేమ పథకాలైనా డిజిటల్ కార్డు ద్వారా అందించే అవకాశం ఉందని తెలిపారు.