ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తుందని, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం ఉదయం కొండపి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వచ్చిన అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 91 అర్జీలు రావడం జరిగిందని, అందులో ఎక్కువ సంఖ్యలో రెవెన్యూ సంబంధిత అంశాలపై, పెన్షన్స్ మంజూరు పై అర్జీలు రావడం జరిగిందన్నారు. ఇళ్ళ స్థలాలు మంజూరుకు, ఇళ్ళ స్థలాలు, భూములు ఆక్రమించారని, రీ సర్వే, అసైన్డ్ భూములను ఆక్రమించుకొని అక్రమ లే అవుట్స్ వేశారని తదితర అంశాలపై అర్జీలు రావడం జరిగిందన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే హౌసింగ్ స్కీమ్ కింద కట్టుకున్న ఇళ్ళకు సంబంధించి బిల్లు లు రాలేదని, కొత్త ఇల్లు మంజూరు గురించి అర్జీలు వచ్చినట్లు మంత్రి తెలిపారు. కొత్త గా ఇళ్లు మంజూరుకు 4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్ల విస్తరణ పై కూడా అర్జీలు వచ్చినట్లు మంత్రి తెలిపారు. కనమల్ల రోడ్డు క్రాసింగ్ ప్రమాదాలకు నిలయంగా మారిందని, సిగ్నల్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని అర్జీలు వచ్చినట్లు మంత్రి తెలిపారు. సైడ్ డ్రెయిన్స్ నిర్మాణాలపై అర్జీలు రావడం జరిగిందన్నారు. వివిధ సమస్యల పై ప్రజల నుంచి వచ్చే అర్జీలను, వినతులను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలో ఒక్క కొండపి నియోజక వర్గంలో రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం నకు 17 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 140 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, ఈ నెల 14 వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరైన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు ఇవ్వడం జరుగుచున్నదని, 1వ తేదీ న ప్రభుత్వ సెలవు దినం అయితే ముందు రోజునే పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజలకు తమ ఆస్తి పై భద్రత కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీపావళి కి ఉచిత గ్యాస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత కలిగిన పెన్షనర్ల కు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న , మరి కొంతమంది పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.