- కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి
- పౌర సంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : కాకినాడ నగరానికి రెండేళ్లుగా ఎన్నికలు లేకపోవడం వలన రూ.20కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు దక్కలేదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. గ్రామాల విలీనం పక్కాగా చేయకపోవడం వలన 2010 నుండి 17వరకు గతంలో ఏడేళ్ళు పాలక వర్గం లేక అప్పట్లోనూ ఆర్థిక సంఘం నిధులు రూ.80 కోట్ల రూపాయలు మేరకు దక్కలేదన్నారు. 2017ఎన్నికల్లో అనివార్యమైన కోర్టు ఆదేశాల వలన 48 డివిజన్లకే పరిమితం కావడంవలన 2022 నుండీ 50 డివిజన్ల పరిధి లేకపోవడంవలన కార్పోరేషన్ చట్టం రీత్యా ఎన్నికల నిర్వహణకు ఆటంకం ఏర్పడిందన్నారు. స్వామినగర్, టీచర్స్ కాలనీ కలవాలంటే తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల దస్త్రాల సాంకేతిక సమస్య పరిష్కారం కావాలన్నారు. పంచాయతీరాజ్ నుండి వేరు చేసి కార్పోరేషన్ లోకి చేర్చకపోవడంవలన ఏడేళ్ల కాలంగా 6 గ్రామాలకు వివిధ గ్రాంట్లు ద్వారా దక్కాల్సిన రూ.140 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వెనక్కిపోయాయన్నారు. పీటముడి తంతుగా విలీనం నిర్వహణను గాలికి వదిలివేయడంవలన ఇటు 4 లక్షల 25 వేల జనాభా కలిగిన కాకినాడ నగరం అటు లక్ష 25 వేల జనాభా కలిగిన 8 గ్రామాలు అసౌకర్యాల చెరలో మ్రగ్గుతున్న దుస్థితికి తెరదింపే ప్రక్రియకోసం కూటమి ప్రభుత్వం సత్వరమే తగిన చొరవ చూపాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు. విలీన గ్రామాల్లో 2 నుండి 9 వరకు జరుగుతున్న గాంధీ జయంతి గ్రామ సభల్లో ప్రత్యేక అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుతూ పౌర వినతులు ఇవ్వడం జరిగిందని పాత్రికేయులకు తెలియజేసారు.