మెదక్ జిల్లా : ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాల నియామకాలు చేపట్టడంవల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహిగా మిగిలిపోయారని, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చని, ఈ తీర్పును అమలు చేయాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, దీనిని రేవంత్ రెడ్డి మాటతో తిరస్కరించారని విమర్శించారు.
ఈ సందర్భంగా, మాదిగలను మాటలతో మురిపించి, మాలలతో కుమ్మక్కై ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని, ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డిలో మోసకారితనం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాందాస్ చౌరస్తాలో ధర్నా నిర్వహించిన వారు, అనంతరం కలెక్టరేట్ వద్ద అడిషనల్ కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు.
“మాదిగల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని కోరుతున్నాము. లేనిపక్షంలో, ఆందోళన ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు. ఎలాంటి పరిణామాలు జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, ఊషన్నగల్ల మురళి మాదిగ, కొమ్ము శేకులు మాదిగ, దండోల్ల సామేల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మాదిగ, మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మాధవి మాదిగ, మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి ముక్క వినోద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కొలుపుల రామస్వామి మాదిగ, గోమారం మహిపాల్ మాదిగ, నీల రాములు మాదిగ, శంకర్ మాదిగ, శరత్ మాదిగ, రాజు మాదిగ, రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.