ప్రకాశం జిల్లా : ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు రైతులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వ్యవసాయ అధికారులకు చెప్పారు. బుధవారం సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని పేర్నమిట్ట లో పర్యటించి స్థానిక మిరప పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ – పంట నమోదైన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ ఈ -పంట నమోదు చేసుకునేలా చూస్తున్నామని వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మొత్తం 2లక్షల 2000 హెక్టార్లు గాను లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు సాగు అయినట్లు కలెక్టర్కు వివరించారు. సాగు చేస్తున్న రైతులలో 99% ఈ పంట నమోదు చేసుకున్నట్లు, రైతుల ఈ- కేవైసీ ని ఈనెల 10వ తేదీ లోపు పూర్తి చేస్తామని తెలియజేశారు. రైతు సేవా కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను రాయితీపై అందిస్తున్నట్లు వివరించారు.
దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బహిరంగ మార్కెట్లో ఎరువులు ,పురుగుల మందులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని తద్వారా ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనాలు నేరుగా రైతులకు దక్కుతాయని తెలియజేశారు, రైతులు తమకు నీటి సమస్య ఉందని కాలువ ద్వారా దానిని పరిష్కరించాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం నియోజకవర్గస్థాయి వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బంది విత్తనాల , ఎరువుల నాణ్యతను, తేమ శాతాన్ని పరీక్షించే విధానాన్ని గురించి కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏ.డి రమేష్ బాబు, తహసిల్దార్ ఆదిలక్ష్మి, వ్యవసాయ అధికారి పావని, ఉద్యాన అధికారి ప్రత్యూష, ఇతర అధికారులు వారితో పాల్గొన్నారు.