ప్రకాశం జిల్లా ఒంగోలు కర్నూలు రోడ్డు లోని చీమకుర్తి- మరి చెట్ల పాలెం రోడ్డు గుంతల మయంగా ఉండి, రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డంతా నీటితో నిండిపోయి ఉండగా, పొదిలి నుండి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలకు ఉండే హబ్ విరిగి పోవడంతో చీమకుర్తి గ్రానైట్ క్వారీల సమీపంలో ఆగినది. గమనించిన డ్రైవర్ సంబంధిత బస్ డిపోకు సమాచారం అందించారు. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు వర్షంలోనే రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. దీనికి గల కారణాన్ని ప్రయాణికులను అడగగా నిత్యం గ్రానైట్ ను తరలించే భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లకు ఈ దుస్థితి ఏర్పడిందని, గ్రానైట్ సంస్థల యాజమాన్యాలు వారి స్వలాభం కోసం సామాన్య ప్రజలను ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని ప్రయాణికులు తెలియజేశారు.
సదరు రోడ్డు మరమ్మతులకు గాను ప్రకాశం జిల్లా కలెక్టర్ జూలై 29వ తారీఖున ప్రతిపాదనలు తెలిపిన ఇంతవరకు ఎటువంటి మరమ్మత్తు పనులు జరగలేదు. ప్రయాణికులకు సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ప్రయాణికులు, స్థానికులు కోరారు.