పిఠాపురం : తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఉప్పాడ, సూరాడ పేట, మాయపట్నం తదితర గ్రామాల మత్స్యకారులను సిపిఐ (యమ్.యల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు, మహిళా సంఘం (ఐప్వా) జిల్లా అధ్యక్షురాలు శీలం అప్పలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల పరిస్థితులను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ తుఫాన్ల వలన గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న ఉప్పాడ, సూరాడ పేట, మాయపట్నం తదితర గ్రామాల మత్స్యకారుల ఇళ్లుల్లోకి సముద్ర అలలు విపరీతంగా వస్తున్నాయని ఫలితంగా కొంతమంది ఇళ్ళు పడిపోయాయని, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని, వారికి నివసించడానికి నీడ, ఆహారం, మంచినీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు పడుతున్న ఇబ్బందులు స్థానిక అధికార యంత్రాంగానికి తెలిసినా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, ఆహారం, మంచినీరు తదితర నిత్యవసర వస్తువులు అందించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి నిత్యవసర వస్తువులు, ఆహారం, మంచినీరు లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా వేటలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి కరువు భత్యం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం సముద్రతీరంలో ఉన్న ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు పి.కాసులు, సీత, లక్ష్మీ, ఏసమ్మ, నూకాలమ్మ, సత్తమ్మ, కొండమ్మ, అమ్మోరమ్మ, చంద్ర, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.