contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అలా చేస్తే వారికీ మనకీ తేడా ఉండదు .. పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం: చంద్రబాబు

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్య నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై నేతలకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మట్లాడుతూ… 125 రోజుల పాలనలో మనం చేసిన మంచి పనులు సమీక్షించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అందుకే 11 సీట్లు

వైసీపీ చేయని తప్పు లేదు. ప్రజల్ని బెదిరించారు… అన్ని విధాలా దందాలకు పాల్పడ్డారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు కుదించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు, బెదిరింపులను తట్టుకుని నిలదొక్కుకున్నాం… ఎదిరించాం… ప్రజలకు అండగా ఉన్నాం. అందుకే చరిత్రలో లేని విధంగా 93 శాతం స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించాం.

మన ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు… అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. గత ప్రభుత్వం మాదిరి కక్ష సాధింపులకు పాల్పడితే మనకూ వారికి తేడా ఉండదు.

ఇవి అమలైతే మనమే నెంబర్ వన్

జాబ్ ఫస్ట్ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పాం. 10 శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహకాలు మరింత ఇస్తామని ప్రకటించాం.

ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ ఎంటర్ ప్రెన్యూర్ డెవలెప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఎనర్జీ….ఇలా 6 పాలసీలు తీసుకొచ్చాం. సూపర్ 6 హామీలులాగే సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చాం. ఇవి అమలైతే ఏపీ నెంబర్ వన్ గా అవుతుంది.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంట్లో ఒక వ్యపస్థాపకులు ఉండాలి. రతన్ టాటా స్ఫూర్తితోనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తాం. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తాం.

ప్రధాని మోదీ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శనీయం

ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాల్సింది ఆయనకున్న పట్టుదల, కృషి.మూడు సార్లు ప్రధాని అయినా మళ్లీ రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు. దేశంలో ఎవరికీ రాని విజయం మోదీ సాధించారంటే దాని వెనక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉంది. పార్టీలో ఎవరూ తప్పు చేయకుండా చూసుకుంటున్నారు.

మేనిఫోస్టో హామీల అమలుపై ధైర్యంగా చెప్పండి

ఎన్నికల మేనిఫోస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్ను రద్దు చేశాం. మత్స్యకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు, గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు, అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు, ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంచాం.

వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు కూడా అందిస్తాం. చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం. చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం. పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లైన్ లో పెట్టాం.

ఏపీకి ఒకటే రాజధాని… అది అమరావతి

రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉంటుంది… అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తాం. పోలవరానికి రూ.12,517 కోట్లు మంజూరయ్యాయి. ఫేజ్-1ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం కూడా మళ్లీ ప్రారంభిస్తాం.

గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కోసం రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు… దీనికి జెన్ కోను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించాం. ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తాం.

దీపావళికి ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం

దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం. వైసీపీ చేసిన అరాచకం భరించలేక ప్రజలు మనల్ని గెలిపించారు… మనం మళ్లీ గెలవాలి అంటే ఎన్డీయే కూటమి చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి… అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :