భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందుగానే గుర్తించి, వాటిని నియంత్రించేలా డిజైన్లను రూపొందించాలని భావి ఇంజనీర్లకు ఆస్ట్రేలియాలోని మోట్ మెక్-డొనాల్డ్ టన్నెల్స్, రవాణా టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ రోషన్ నాయర్ సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ‘సొరంగం – భద్రత, రూపకల్పన, సుస్థిరత, స్థిరత్వం, డిజిటలైజేషన్, కృత్రిమ మేధ’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.
ఇన్-స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) గీతం విద్యార్థి విభాగం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు డిజైన్లను రూపొందించే సమయంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించేందుకు అమలు చేసిన వినూత్న పరిష్కారాలను వివరించారు. ఇంజనీరింగ్-లో సుస్థిరత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పునర్వినియోగపరచదగిన, బహుళ ప్రయోజనాల కోసం అనుకూలించే డిజైన్ల ఆవశ్యకతను చాటి చెప్పారు. భూమి గట్టిదనం కోసం చేసే పరిశోధనలో వేసే బోర్-హోల్స్-ను, భవిష్యత్తులో నీటిని వెలికితీసేలా.. రెండింటికీ పనికొచ్చేలా ఉపయోగించడం, దీర్ఘకాలిక ప్రాజెక్టు మన్నికకు మద్దతు ఇచ్చేలా, బహుళ ప్రయోజనంగా రూపకల్పన చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఇంజనీరింగ్ డిజిటలైజేషన్, కృత్రిమ మేధల గురించి డాక్టర్ నాయర్ మాట్లాడుతూ, డిజిటలైజేషన్ అనేది పరస్పర ప్రయోజనంతో కూడిన పరిష్కాలను సూచిస్తుందని, ఇవి ఇంజనీర్లు వినూత్నమైన, పద్ధతులను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయన్నారు. 2050 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలన్న భారతదేశం ప్రయత్నానికి యువ ఇంజర్లు తగిన సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలని ప్రోత్సహించారు. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో లోపాలను తొలగించడానికి నాణ్యత నియంత్రణ, సమగ్ర సమీక్షల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
కృత్రిమ మేధ శక్తివంతంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ మానవ పర్యవేక్షణ అవసరమని, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తారని డాక్టర్ నాయర్ చెప్పారు. విద్యార్థులు గొప్ప కలలు కనాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, అంకితభావంతో పనిచేస్తే ఇంజనీరింగ్ రంగంలో తమ ఆశయాలను సాధించగలరని వారికి భరోసా ఇచ్చారు.
తొలుత, గీతంలోని పలు ప్రయోగశాలలు- జీ-ఎలక్ట్రా, ఏరోమోడలింగ్, సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ) ల్యాబ్-లను డాక్టర్ నాయర్ సందర్శించారు.
స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య డాక్టర్ నాయర్-ను సత్కరించగా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి వందన సమర్పణ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.