పిఠాపురం : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కొనసాగించాలని రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి సంఘం నాయకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు తెలంగాణ ప్రభుత్వంను డిమాండ్ చేశారు. 1985లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేశారు. సాహిత్యం, సంగీతం, సాంస్కృతిక, కళా రంగాలలో బోధన, పరిశోధన, ప్రచురణ, పర్యవేక్షణ తదితర రంగాలలో సేవలను అందిస్తూ, భవిష్యత్తు తరాల వారికి మన కళలను, సాహిత్యాన్ని పరిచయం చేయడానికి ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం, వరంగల్ ప్రాంతాలలో క్యాంపస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఈ విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ తెలుగుజాతి ఔన్నత్యం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, అటువంటి వ్యక్తి పేరు తొలగించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు పేరు తొలగించే విషయంలో పునరాలోచన చేసి, అదే పేరును కొనసాగించాలని గౌరీ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ కు విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి సంఘం, విద్యార్థులు వినతి పత్రాన్ని పంపించడం జరిగిందని గౌరీ నాయుడు తెలిపారు.