కాకినాడ : కాకినాడ నగరంలో గాంధీనగర్ కూడలి అన్నమ్మఘాటీ జంక్షన్, డైరీఫారం సెంటర్, ఇంద్రపాలెం లాకులు కార్నర్ వద్ద ఏర్పాటైన మద్యం దుకాణాలు తీవ్ర అభ్యంతరకరంగా వున్నాయని ప్రజలు ఇప్పటికే స్వచ్ఛందంగా రోడ్డెక్కిన వాస్తవాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుని వాటిని రద్దు చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ఏరియాల వారీగా మద్యం దుకాణాల అనుమతులిచ్చిన అభ్కారీ శాఖ చేతులు దులుపుకోవడం తగదన్నారు. ప్రభుత్వ ప్రయివేటు గుడి, బడి, బస్ స్టాప్, మార్కెట్ పార్కు, రద్దీకూడళ్లు, జనం నివసించే ప్రదేశాలలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న మద్యం దుకాణాల అనుమతులపై అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. వారికి మెమోలు జారీ చేయాలన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీలో అనుమతించిన మద్యం దుకాణాలు ఎక్కడెక్కడ నెలకొల్పుతున్నారో జాబితా ప్రకటించి ప్రజల అభ్యంతరాలు లేకుండా సచివాలయం పరిధిలో గ్రామసభల ద్వారా పారదర్శకంగా పబ్లిక్ చేయాలన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకించే మద్యం దుకాణాలను రద్దు చేయాలన్నారు. క్లాస్, మాస్ ఏరియా అనే తేడా లేకుండా మద్యం దుకాణాలు అండర్ బార్ల తరహాలో నిర్మాణం అవుతున్నాయన్నారు. మద్యం దుకాణాల పర్మిషన్ పొందిన కొందరు కొన్ని ఏరియాల్లో వ్యాపార వృద్ధికి వీలుగా అదనంగా రెండు, మూడు వరకు బెల్ట్ తరహాలో అమ్ముకునే బోర్డులేని షేర్ దుకాణాలు తయారవుతున్నాయన్నారు. ప్రజలు రోడ్డెక్కే విధంగా అనుమతులు ఇస్తున్న కూటమి తీరు తగదన్నారు. మద్యం దుకాణాల్లో లూజు అమ్మకాలు జరపకుండా బహిరంగంగా మద్యం సేవించే అసాంఘిక చర్యలను నియంత్రణ చేసేందుకు నగర వ్యాప్తంగా సిసి కెమెరాల నిర్వహణను పునరుద్ధరణ చేయాలన్నారు. మద్యపాన నిషేధం కోసం పాటు పడిన ఎన్ టి ఆర్ ఆశయాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం అమ్మకాల ఆదాయంలో పది శాతం నిధులను ఎన్ టి ఆర్ పేరిట మద్యపాన వ్యతిరేక ప్రచార ఉద్యమానికి అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటుకు కేటాయించి ప్రభుత్వ నిధులతో ప్రతి మండల కేంద్రంలో నిర్మాణ నిర్వహణ చేయాలని కోరారు.