కాకినాడ : రైతుబజార్ లో సమస్యలు ఉంటే కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నాలు చేయాలి తప్ప రైతు బజారుకు వచ్చే వినియోగదారులను ఇక్కట్లకు గురి చేసే విధంగా అక్కడి వ్యాపారులు చేస్తున్న ఆందోళనలు ఎంత మాత్రం తగవని ప్రయివేటు వ్యక్తులు ప్రవేశించి రైతు బజార్ లో ధర్నాలు చేయిస్తున్న ప్రణాళిక వెనుక రాజకీయ దళారీల దోహదంతో రైతు బజార్ అధికారుల ప్రమేయం వుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు బజార్ లో ధర్నాలు చేయడం నిషేధం చేయాలని అద్దె కట్టే వారు, అద్దె కట్టని వారందరికీ నిర్ధిష్ట స్థలాలు కేటాయించి నిర్వహణ చేయించాలని సిటీ ఎమ్మెల్యే అధ్యక్షతన సమావేశం నిర్వహించి అక్కడి సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలని మూడు అంశాల వినతి పత్రాన్ని అందజేశారు. ఈమేరకు ప్రభుత్వంలో ఇక్కడి ఇంగ్లీష్ కాయగూరల రైతులు వైఎస్ఆర్ పార్టీ ద్వారా లబ్ది పొందారని పేర్కొంటున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. ఇంగ్లీష్ కాయగూరలు అమ్ముకునే రైతులకు అద్దె ప్రాతిపదిక మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో నిర్ధిష్ట స్థలాలు కేటాయించి నిర్వహణ చేయగా, గత ప్రభుత్వ హయాంలోనే ఇప్పుడు వున్న అధికారులు వున్నారని వారి వేధింపులు తట్టుకోలేక హైకోర్టుకు వెళ్లి వారి కొట్లు నిలుపుకున్న కేసు ఇంకా నడుస్తున్నదన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ వర్గంకు చెందిన కొంతమంది గత నాలుగు నెలలుగా డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను, జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ను పిఠాపురంలో జరిగిన గ్రీవెన్స్ నందు తప్పు దారి పట్టించే తీరుగా తప్పుడు పిర్యాదు చేసారన్నారు. కాకినాడ రూరల్ కు చెందిన రైతుల బాగోగులు చూడాల్సిన రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వర రావు (నానాజీ) జోక్యం లేకుండా కొందరు అనుచర బంధు వర్గం పేరుతో యాగీ చేయడం జరుగుతున్నదన్నారు. సిటీ పరిధిలో వున్న రైతు బజార్ కు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వర రావు (కొండబాబు) అజమాయిషీ లేకుండా దొమ్మీ చేస్తున్న క్రమంలోనే డేగల జగదీష్ అనే అతి నిరుపేద యువ రైతును కాయగూరల స్టాల్స్ నుండి రెండు రోజుల క్రితం అనుచితంగా తరిమేశారన్నారు. అతనికి అధికారులు యధాస్థానం కేటాయించాలన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు కొట్లు కేటాయించినప్పుడు భారీగా ఆక్రమించుకున్న వారి కొట్లు విస్తీర్ణం తగ్గించి కేటాయించకుండా అనుచిత పద్ధతిలో గెంటేసారన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా గురువారం నాడు ఇంగ్లీష్ కాయగూరల రైతు స్థలాన్ని లేకుండా చేయడంతో ఇతర కాయగూరల వ్యాపారుల, ఆకుకూరల వ్యాపారుల నడుమ గొడవలు సృష్టించే ప్రక్రియకు రైతు బజార్ అధికారులే రాజకీయ దళారీవర్గాల ఒత్తిడికి గురయ్యి కల్పన చేశారన్నారు. టుటౌన్ లో ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారన్నారు. శుక్రవారం నాడు బజారులో ధర్నా చేయడం ద్వారా వినియోగదారులను ఇక్కట్లకు గురి చేసారన్నారు. ఇలా ఎవరికి వారు అక్కడ వ్యాపారం చేసుకునే రైతులు ధర్నాలకు, కొట్లాటలకు దిగితే రాజ్యాంగ విధానం ఏమవుతుందని…? ప్రశ్నించారు. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనుచితంగా ధర్నాలకు పాల్పడిన వారిపైనా వారి వెనుక ప్రోత్సాహం చేసిన వారిపైనా పోలీస్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతు బజార్ యావత్తూ అవినీతి అక్రమాల ఆక్రమణల పుట్టగా తయారయ్యిందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్న దళారుల జాడ్యం వదలడం లేదన్నారు. అయిదేళ్లుగా వున్న అధికారుల బదిలీ జరగలేదన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ముగ్గురు సిబ్బంది 15 ఏళ్లుగా ఇక్కడే వుండటం వలన సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర రైతు బజార్ రూల్స్ ప్రకారం నిర్వహణ చేయాలన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే పర్యవేక్షణ లేకుండా చేస్తున్న నిర్వహణ వలన సమస్యలు ఎక్కువయ్యి రావణ కాష్టంగా మారడానికి కారణంగా పేర్కొన్నారు. రైతు బజార్ లో వివాదాలకు స్వస్తి పలికి కిరాణా, ఫ్రూట్స్, మసాలా, ఆకుకూరలు, కాయగూరలు, ఇంగ్లీష్ కాయగూరలు అమ్ముకుంటున్న రైతులను ముందుగా గుర్తించి బినామీలను లీజుదారులను తొలగించి దుకాణాల నిర్వహణ చేపట్టే కఠిన చర్యలు అమలు చేయాలన్నారు. అద్దె ప్రాతిపదిక దుకాణాలు యధావిధిగా వుంచి అద్దెలేని ప్రాతిపదిక దుకాణాలు యధాస్థానం కల్పించి వారం వారం లాటరీ విధానం లేకుండా ఎవరి వస్తువులు వారు విక్రయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతు ఫోటో వారు విక్రయించే వస్తువులు వారికి కేటాయించిన స్థలం కొలతలతో బోర్డు ఏర్పాటు చేయిస్తే వారం వారం తగాదాలు పడాల్సిన అవసరం లేదన్నారు. వారం వారం లాటరీ పద్ధతి వలన దళారుల అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్న దుస్తితి వుందన్నారు. సిసి కెమెరాల నిర్వహణ లేకపోవడం వలన రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులు చేరి గంజాయి అడ్డాగా మార్చుతున్నారన్నారు. ఓవర్ బ్రిడ్జి దిగువ రెండు కానులను పార్కింగ్ కి వినియోగం చేయకుండా తోపుడు బండ్లు పెట్టించి సొమ్ములు చేసుకుంటున్న దురవస్థ వుందన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయంతో రైతు బజార్ అవస్థలు తొలగిస్తామన్నారు.