- రాజ్ పాకాల ఇంట్లోనూ తనిఖీలు, అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
- ఇది రాజకీయ కుట్ర: బీఆర్ఎస్
హైదరాబాద్ జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్‌పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో పోలీసులు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసును నమోదు చేశారు.
భారీగా విదేశీ మద్యం స్వాధీనం : మద్యం పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌజ్ యజమాని రాజ్ పాకాలా కేటీఆర్ బావమరిదిగా గుర్తించారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మద్యం పార్టీ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో విదేశీ మద్యం సహా, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై విచారణ చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్వైజర్ కార్తిక్, ఏ2గా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను చేర్చామన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించినట్లు చెప్పారు. కర్ణాటక లిక్కర్‌తోపాటు విదేశీ మద్యం కూడా కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఏడు లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ పాకాల పరారీలో ఉన్నారని, విచారణలో మరికొన్ని వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఫామ్‌హౌస్‌లో క్యాసినో పరికరాలు : క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది. ఈ ఫామ్‌హౌస్ పార్టీపై బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే రాజధానిలో అధిక మొత్తంలో డ్రగ్స్, గంజాయిలను పోలీసుల స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జన్వాడ ఫామ్‌హౌస్ అర్ధరాత్రి పార్టీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.