హైదరాబాద్ – అబిడ్స్ : నగరంలోని దీపావళి టాపాసుల దుకాణంలో నిప్పురవ్వలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గంటన్నర పాటు పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సుల్తాన్‌బజార్ బొగ్గుకుంట హనుమాన్ టెక్డీలోని వ్యాపార సముదాయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవ్వగా, పది వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌కు మంటలు వ్యాపించి కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకెళ్తే
బషీర్‌బాగ్‌కు చెందిన గుర్విందర్ సింగ్ అనే వ్యాపారి హనుమాన్ టెక్డీలో పారస్ ఫైర్వర్క్స్ దుకాణం ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో కొనుగోలుదారులు పెద్దఎత్తున వచ్చారు. అందరూ కొనుగోళ్లలో ఉండగా, దుకాణంలో ఒక్కసారిగా పటాసులు ఒకదాని వెంట ఒకటి పేలాయి. భారీ శబ్ధాలు చేస్తూ క్షణాల్లో టపాసులకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కొనుగోలుదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
మంటలు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌కు వ్యాపించడంతో లోపల సామగ్రి కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుకాణంలో పని చేసే ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పది వరకు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఐదు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. బయటి నుంచి నిప్పు రవ్వలు వచ్చి దుకాణంలో పడటంతో మంటలు అంటుకున్నట్లు దుకాణంలో పని చేసే సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా టపాసుల దుకాణానికి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు.