కాకినాడ : క్రోధినామ సంవత్సర కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠం ఆధ్వర్యంలో రూరల్ వాకలపూడి సూర్యారావు పేట సముద్ర తీరం నందు సుప్రభాత వేళలో సముద్రునికి కోటి ఒత్తులతో కార్తీక పూర్ణకుంభ హారతిని సనాతన రీతిలో ఘనంగా నిర్వహించారు. కలశ ప్రతిష్ట పసుపు కుంకుమలతో అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం చేపట్టి సముద్రజలాల్లోకి పట్టువస్త్రంతో మంగళకర సంకీర్తనల నడుమ నైవేద్య నివేదన సమర్పించారు. విష్ణు, శివ, లలితాదేవి సహస్ర స్తోత్రనామ పారాయణ నిర్వర్తించి హారతులందుకున్నారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ స్వయంభు వెలిసిన తీరాల్లో పీఠం ఉపాసకులు సముద్రునికి పూర్ణకుంభ హారతితో ఆరాధన చేయడం సనాతన సంప్రదాయమన్నారు. విశ్వ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని పర్యావరణాన్ని భగవంతుని స్వరూపంగా ఆరాధించాలన్నారు. పాల సముద్రం నుండి అమృత వైభవం ఆవిర్భవించిన క్షీర సాగర మధనం ఇందుకు సంకేతంగా పేర్కొన్నారు. శ్రీవారి సేవా సమితి బృందం సభ్యులు వరలక్ష్మి, మంగతాయారు, పద్మ, కుమారి, సుధారాణి, రేఖ, సంధ్య, నూకాలమ్మ, పద్మావతి, నూకరత్నం, ధనలక్ష్మి, శారద, పాపాయమ్మ, పావని, ప్రసన్న, తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు.