కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు సోమవారం సాయంత్రం 5 గంటలకు దీక్ష చేపట్టారు. కాకినాడలో 14ఏళ్లుగా పెండింగ్ వున్న 8గ్రామాల విలీనం పూర్తి చేసి సత్వరమే 5నెలల్లోగా కార్పోరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలని 2025-26 ఆర్థిక సంఘం నిధులు తీసుకురావాలని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఎన్నికలు లేక నగరానికి రావాల్సిన 20కోట్ల ఆర్థిక సంఘం నిధులు రాలేదన్నారు. విలీన గ్రామాల తాత్సారం వలన గతంలో 2010 నుండి 16వరకు ఎన్నికలు జరగక 60కోట్ల ఆర్థిక సంఘం నిధులు వెనక్కి పోయాయన్నారు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, స్వామినగరం, టీచర్స్ కాలనీ గ్రామాలకు ఎన్నికలు జరగక 140కోట్ల రూపాయల నిధులు వెనక్కిపోయాయన్నారు. జమిలీ ఎన్నికల బిల్లు తీసుకువస్తున్న తరుణంలో తక్షణమే విలీన గ్రామాల పెండింగ్ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించకుంటే మరో మూడున్నర ఏళ్ల పాటు ఆర్థిక సంఘం నిధులు తీసుకురావడం సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. జిల్లా మంత్రి, ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినందున స్పందించాలని కోరారు. అప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు.