హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో ఓ దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇది రెండోసారి హిందూ దేవాలయాల పై దాడులు. హిందూ దేశంలో హిందూ దేవాలయాల పై దాడులు బాధాకరమని హిందువులు ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసేందుకు ఈరోజు ఉదయం పూజారి వచ్చారు. అయితే గుడిలో విగ్రహాలు ధ్వంసమై ఉండటాన్ని గుర్తించి, స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దుండగులు సోమవారం అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుడి గేట్లను తెరిచి లోనికి వెళ్లి విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా ఉందని చెబుతున్నారు.
హనుమాన్ గుడిలోని విగ్రహాలను ధ్వంసం చేశారనే విషయం తెలియగానే బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని ధర్నాకు దిగారు. ఇదిలా ఉండగా, సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దేవాలయంలో స్వామివారిని తిరిగి ప్రతిష్ఠించే అంశంపై స్థానికులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ కాలనీలోని దేవాలయం ప్రాంతంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొన్నిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడిలోనూ దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇది జరిగి మూడు వారాలు అవుతోంది. మూడు వారాల వ్యవధిలో హైదరాబాద్‌లో ఇది రెండో ఘటన.