పశ్చిమ ఢిల్లీలో అత్తమామలను కడతేర్చిందో కోడలు. ఓ వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి పలు విషయాలను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వివరాలు తెలిపారు.పశ్చిమ ఢిల్లీలోని దుర్గా విహార్ ప్రాంతంలో వృద్ధ దంపతులు రాజ్ సింగ్ (61), ఓంవతి (58) నివసిస్తుంటారని తెలిపారు. నిన్న ఒకే మంచం మీద ఆ వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించడంతో తమకు స్థానికులు సమాచారం అందించారని, మృతుల ముఖాల మీద గాయాలు ఉన్నాయని చెప్పారు.
దర్యాప్తులో వారిని కోడలు కవిత (35) గొంతుపిసికి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసిందని తేలినట్లు చెప్పారు. ఈ హత్యలకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. తన భర్త సతీశ్ సింగ్ (37) ఎదుటే ఆమె అత్తమామలను చంపిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ హత్యలలో సతీశ్ సింగ్ పాత్ర ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు.వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, పలు కోణాల్లో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్య జరిగిన సమయంలో కవిత భర్తతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా అదే గదిలో ఉన్నట్లు తెలుస్తోంది.