గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సోషల్ సైన్సెస్ లో ‘పరిశోధనా పద్ధతుల’పై పదిరోజుల కార్యశాలను ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి అత్యుత్తమ పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన జ్జానం, నైపుణ్యాలు పెంపొందించేందుకు లక్షించారు.
సమర్థవంతమైన పరిశోధన ప్రణాళిక, అమలు, విశ్లేషణకు సంబంధించి సమగ్ర అంతర్దృష్టులతో పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడానికి ఈ కోర్సును రూపొందించారు. ఇందులో పాల్గొనేవారు క్రమబద్దమైన సాహిత్య సమీక్షలు, పరిశోధన రూపకల్పన, డేటా సేకరణ, విశ్లేషణ పద్ధతులు, నైతిక పరిశీలనలు, అవసరమైన సాఫ్ట్ వేర్ సాధనాలతో ఆచరణాత్మక శిక్షణ పొందుతున్నారు.
పరిశోధనను బాధ్యతాయుతంగా నిర్వహించడం, వివిధ రకాల సమాచార విశ్లేషణ, పరిశోధనా రూపకల్పన, సాంకేతిక శిక్షణ, నమూనా పరిణామం నిర్దారణ, అనులేఖనం, సమాచర సేకరణ వివరాలు పొందుపరచే విధానాలపై సదస్యులకు మంచి అవగాహన ఏర్పరచనున్నారు. పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చెందిన నిపుణులు ఈ కార్యశాలలో వక్తలుగా పాల్గొని తమ అనుభవాలు, పరిశోధనా పద్ధతులపై పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ నుంచి ప్రొఫెసర్ ఆర్.కె.మిశ్రా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, ఓపీ జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ రూపేష్ కుమార్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటికి చెందిన డాక్టర్ శివోహం సింగ్, వీఎన్ఆర్ విజ్జాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ నుంచి డాక్టర్ నిత్య సుందర్ నందా వంటి పలువురు విద్యావేత్తలు ప్రధాన వక్తలుగా ఆయా ఎంపిక చేసిన అంశాలపై ప్రసంగిస్తూ, పరిశోధక విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
మనదేశంలోని పలు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 30 మంది పరిశోధక విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని, తమ పరిశోధనా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన నైపుణ్యాలను అలవరచుకుంటున్నారు.
ఈ కోర్సు సహ సంచాలకుడు డాక్టర్ మనోజ్ కుమార్ పర్యవేక్షణలో, డాక్టర్ కె.రఖా, డాక్టర్ శోభా మిశ్రాలు సమన్వయం చేస్తున్నారు. ఈ కోర్సు కేవలం నేర్చుకునే మెథడాలజీల గురించి మాత్రమే కాకుండా నైతిక పరిశోధన పద్ధతులు, మెథడాలాజికల్ కఠినత యొక్క సంస్కృతిని పెంపొందించడం గురించి కూడా విశదపరుస్తోందని కార్యశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తెలియజేశారు. సాంఘిక శాస్త్రాల రంగానికి అర్థవంతంగా దోహదపడే తదుపరి తరం పరిశోధకులను అభివృద్ధి చేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. వచ్చే గురువారం ఈ కార్యశాల ముగింపు వేడుక నిర్వహించి, ఆసక్తిగా పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలను పంపిణీ చేయనున్నారు.