మెదక్ జిల్లా, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత తాసిల్దార్‌తో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.
సన్న రకం ధాన్యం క్రింద ఏ రకమైన ధాన్యాన్ని పరిగణిస్తున్నామనే అంశంపై రైతులకు స్పష్టంగా తెలియాలనే ఉద్దేశ్యంతో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. “సన్న రకం ధాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అర్హులైన ప్రతి రైతుకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము,” అని ఆయన పేర్కొన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొనుగోలు ప్రక్రియను సజావుగా, సక్రమంగా చేపట్టాలని, రైతుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “సన్న రకం మరియు దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాం. సమగ్ర కార్యాచరణతో ముందుకు పోవాలి,” అని తెలిపారు. ధాన్యం రవాణాకు కేటాయించిన వాహనాలను ఇతర పనులకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలు సన్నద్ధం చేశామని, కొనుగోలు కేంద్రాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.