contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కిరాయి హత్యకు కుట్ర .. వెలుగులోకి సంచలన విషయాలు!

విజయవాడలో తప్పుడు పత్రాలతో భూములు ఆక్రమించడమే కాకుండా.. న్యాయపోరాటం చేస్తున్న భూయజమానిని అంతమొందించేందుకు ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూర్ గౌతంరెడ్డి కిరాయి హత్యకు కుట్రపన్నినట్టు తేలింది. విజయవాడ సత్యనారాయణపురంలో భూకబ్జా కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. స్థల యజమాని గండూరి ఉమామహేశ్వరశాస్త్రిపై ఇటీవల జరిగిన దాడి ఘటన వెనుక పూనూరు గౌతంరెడ్డి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ దాడికి గౌతం రెడ్డి పథక రచన చేశారని, రూ.25 లక్షల సుపారీకి డీల్ కుదుర్చుకున్నారిని వెల్లడించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర బాబు మీడియాకు వివరాలు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వివరించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసు కమిషనర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కబ్జాకు గురైన తన స్థలం విషయంలో బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి కొన్నేళ్లుగా పోలీసులు, కోర్టులు, మీడియా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అతడు పోరాడేందుకు రోడెక్కకుండా కాలు గానీ, చేయి గానీ తీసేయాలని గౌతం రెడ్డి భావించారు. ఈ మేరకు తన కార్యాలయంలో సెటిల్‌మెంట్లు చేసే లాయర్ పృథ్వీరాజ్‌, అతడి స్నేహితుడు అనిల్‌‌తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం అనిల్‌ తన స్వగ్రామైన చిల్లకల్లుకు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకునే గడ్డం వినోద్‌, తాలూరి గణేశ్‌, దేవళ్ల వంశీ, ఉప్పతోళ్ల అశోక్‌కుమార్‌లను దాడికి పురమాయించాడు. వారి ఖర్చుల కోసం రూ.80 వేలు ముట్టచెప్పాడు.

దీంతో నిందితులు శాస్త్రిపై దాడికి రెండుసార్లు ప్రయత్నించారు. గత నెల 31న రాత్రి, ఈనెల 6న మధ్యాహ్న సమయంలో దాడికి యత్నించారు. 6న శాస్త్రిపై నిందిత నలుగురు యువకులు దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు ఫోన్ ద్వారా ఫిర్యాదు అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమకు అనిల్ రూ.80 వేలు ఇచ్చాడని నిందితులు ఒప్పుకున్నారు. తదుపరి విచారణలో అసలు విషయాలు వెలుగుచూశాయి. పూనూర్ గౌతంరెడ్డి కుట్ర మొత్తం బయటపడింది.

నిందితులు వాడిన బైక్‌ న్యాయవాది పృథ్వీరాజ్‌కు చెందినదని గుర్తించారు. నిందితులు పారిపోవడానికి ఉపయోగించిన కారు గౌతం రెడ్డి అనుచరుడు వెంకటేశ్వరరాజుదిగా తేల్చారు. వారి కాల్‌డేటాను పరిశీలించగా పృథ్వీరాజ్‌, అనిల్‌, పురుషోత్తమరావు, గౌతంరెడ్డి మధ్య ఎక్కువ కాల్స్‌ ఉన్నట్టు నిర్ధారించారు.

పరారీలో గౌతం రెడ్డి.. పోలీసుల గాలింపు..
కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌతం రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురు నిందితుల పేర్లను చేర్చారు. మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు గుర్తించారు. ఏ1గా పూనూరు గౌతంరెడ్డి పేరుని చేర్చారు. పరారీలో ఉన్న నిందితులు అందరి కోసం గాలిస్తున్నట్టు వివరించారు. గౌతంరెడ్డి కడపలో గానీ, నెల్లూరులో గానీ తలదాచుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :