contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మొక్కలను పెంచుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం .. పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా

పిఠాపురం : ప్రస్తుత సమాజంలో ప్రపంచం నలు మూలలా వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి, పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూ గ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆలీషా ప్రసంగించారు. భగవంతుడు మానవునికి మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని ప్రసాదించాడని అందువల్ల ఆ జ్ఞానాన్ని సర్వ మానవ సౌభాతృత్వం కొరకు వినియోగించాలని అన్నారు. కొంతమంది వ్యక్తులు స్వార్ధ పూరితమైన ఆలోచనలతో ఇష్టానుసారం చెట్లను నరికివేయడం వలన భూతాపం పెరిగిపోయి, పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని, వాతావరణంలో తీవ్ర పరిణామాలు

సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని పేర్కొన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించాలని పేర్కొన్నారు. మొక్కలను పెంచడం ద్వారా భూగ్రహాన్ని తిరిగి హరితవనంలా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రం, సామాజిక సేవ నేత్రం అనే రెండు నేత్రాల ద్వారా ప్రపంచాన్ని చూడగలిగితే కార్తీక పౌర్ణమి వెలుగులు జీవితాంతం అతడిపై ప్రసరిస్తాయని అన్నారు. ఆధ్యాత్మిక విలువలు లోపించడం వలన మానసిక ప్రశాంతతను కోల్పోతున్న మానవుడు నిత్యం అలజడులకు లోనవుతూ అనేక హింసాత్మాక చర్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వలన మనసును స్థాయి పరుచుకునే స్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రతిఒక్కరూ బాల్య దశనుండే ఆధ్యాత్మిక, తాత్విక విలువలను చిన్నారుల్లో పెంపొందించాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక భావనల వలన ప్రకృతిని పరిరక్షించుకోవచ్చునని అన్నారు.

అనంతరం గీతావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పీఠం కేంద్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.టి.వి.వర్మలు సభలో మాట్లాడుతూ మానవుని జీవితంలో జరిగే పరిణామ క్రియలను గురించి సభకు వివరించారు. మానవుడు తన దైనందిన జీవితంలో ఎప్పుడూ భూత, భవిష్యత్ కాలాల పైనే దృష్టి పెడుతూ వాటి గురించే ఆలోచిస్తూ దుఃఖంలో మునిగి తేలుతున్నాడని, అందువలన వర్తమానంలో జరుగుతున్న విషయాలను గ్రహించలేక పోతున్నాడని తెలిపారు. సద్గురువులను ఆశ్రయించడం ద్వారా స్థిత ప్రజ్ఞత పొందగలుగుతాడని పేర్కొన్నారు. వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తూ, సర్వ మానవ శ్రేయస్సుకై అనునిత్యం కృషి చేస్తున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. పీఠం యొక్క పీఠాధిపతుల ఔన్నత్యం గురించి సభకు వివరించారు. పీఠాధిపతులు అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను ఆవలంభించడం ద్వారా మానవుడు తాను కోరుకునే ముక్తి మార్గం వైపు పయనించగలుగుతాడని తెలిపారు. అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున నిరుపేదలకు కుట్టుమిషన్లు, పక్షుల ఆహరం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాలవికాస్ నందు శిక్షణ పొందుతున్న చిన్నారులు కుమారి, ఉమావైష్ణవి, మరియు పీఠం సభ్యులు అమీర్ భాషా ఆధ్యాత్మిక ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. సభలో పీఠం సభ్యురాలు అనిశెట్టి ఉమ పర్యవేక్షణలో నిర్వహించిన సంగీత విభావరి సభికులను రంజింప చేసింది. ఈ సందర్భంగా 162 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్.టి.వి. ప్రసాదవర్మ, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :