మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. యాంటీ-నక్సలైట్ ఆపరేషన్‌లో ఉన్న భద్రతా బలగాలకు శనివారం ఉదయం 8 గంటల సమయంలో నారాయణపుర్లోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఘటనాస్థలి నుంచి మవోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను రాయ్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. జవాన్లకు మెరుగైన చికిత్స అందించడం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ వెల్లడించారు.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.