ఖమ్మం జిల్లా మెడికల్ కాలేజీలో అమానుషం జరిగింది. చైనీస్ కటింగ్ చేయించుకున్నాడని ఫస్టియర్ స్టూడెంట్‌కు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రహస్యంగా విచారణ మొదలుపెట్టిన ఉన్నతాధికారులు సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్చార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించడం గమనార్హం
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్‌లో చేరాడు. కాలేజీ హాస్టల్లో ఉంటున్న అతను ఈ నెల 12వ తేదీ రాత్రి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు. సెకండియర్ విద్యార్థులు అది చూసి బాగోలేదని చెప్పడంతో.. మళ్లీ వెళ్లి డిఫరెంట్ స్టైల్లో కటింగ్ చేయించుకున్నాడు. ఆ విద్యార్థి హాస్టల్‌కు వచ్చేసరికి యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ అక్కడకు వచ్చాడు.
విషయం తెలుసుకున్న సదరు ప్రొఫెసర్ రెహమాన్ సీనియర్లను మందలించాల్సింది పోయి.. బాధితుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు కటింగ్ చేయించుకుంటావా అంటూ దగ్గరలోని సెలూన్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఈ నెల 13న ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదుచేశారు.
విద్యార్థి ఫిర్యాదుపై స్పందించిన ప్రిన్సిపల్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్‌ను విధుల్లో నుంచి తప్పించారు. ఈ ఉదంతంపై ప్రత్యేక కమిటీని నియమించి రహస్యంగా విచారణ చేయిస్తున్నారు. తాజాగా ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రిన్సిపల్ స్పందించారు. నలుగురు సభ్యులతో కమిటీ వేసిన మాట వాస్తవమేనని.. నివేదికను తొందరలోనే డీఎంఈకి పంపిస్తామని తెలిపారు.