ఆంధ్రప్రదేశ్ : అదానీ కంపెనీలకు జగన్ అనుమతులు ఇవ్వడం మీద దర్యాఫ్తు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. అదానీతో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారం అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో అర్ధరాత్రి అనుమతులు ఇవ్వడం ఎందుకో దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ డీల్ కారణంగా పాతికేళ్లపాటు ప్రజలపై లక్షన్నర కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. అదానీతో జరిగిన ఒప్పందాలను రద్దు చేసి, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచించారు.
నాడు జరిగిన ఒప్పందాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టును అదానీ కంపెనీకి అప్పగించడంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.