హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఓ హోటల్ గదిలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్న నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 18 గ్రాముల ఎండిఎంఏ, గ్రాము ఓజీ ఖుష్, ఒక ఎల్ఎస్‌డీ పేపర్, ఏడు గ్రాముల ఇండియన్ చరస్, ఆరు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4.18లక్షలు ఉంటుందని సమాచారం.
ఈ దాడిలో కొరియోగ్రాఫర్ కన్నా మహంతి, ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న ప్రియాంక రెడ్డి, గుల్లిపల్లి గంగాధర్, ఓగిరాల శాకీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పరీక్షలు నిర్వహించగా, ప్రియాంక రెడ్డి మినహా మిలిగిన ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ వినీత్ మీడియాకు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఫ్రీజి అనే వ్యక్తి నుంచి వీరు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫ్రీజి పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.