మహాలక్ష్మి పథకం అమలుతో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థను నష్టాల నుంచి గట్టెక్కించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 115 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని వివరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆర్టీసీ, రవాణశాఖ స్టాళ్లను పరిశీలించారు. రవాణాశాఖ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, రవాణాశాఖ, ఆర్టీసీ విజయాలపై కరపత్రం విడుదల చేశారు. 54 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
ఏడాదిలోపే 55 వేల ఉద్యోగాలిచ్చామని ఒక్కటి తగ్గినట్లు నిరూపించినా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దేశంలో మెట్రో నగరాలన్నీ కాలుష్యకాసారంతో సతమతమవుతున్న వేళ హైదరాబాద్ ఆ ఊబిలో చిక్కుకోవద్దనే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రానున్న రెండేళ్లలో భాగ్యనగరంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
రవాణాశాఖను కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ల హక్కులను, ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆనాడు 6 గ్యారంటీలకు ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చారు. అందుకే ఈ ప్రభుత్వం విజయం సాధించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లో నడుస్తోంది. నగరం నిర్మానుష్యంగా మారకుండా ఉండేందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఫ్రీ చేశామని సియం రేవంత్ అన్నారు.
పొన్నం ప్రభార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీ, రవాణా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మూసీ ప్రక్షాళన జరగాలంటే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 115.76 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. దీంతో సుమారు రూ.3 వేల 902 కోట్లు ఆదా అయిందని వెల్లడించారు.