పిఠాపురం : విజయవాడ పట్టణంలో డిసెంబర్ 28, 29 తేదీలలో నిర్వహించబోయే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిలారి గౌరీ నాయుడుకి ఆహ్వానం అందింది. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణ చంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు తనను ఆహ్వానించినట్లు గౌరీ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా యువగళం శీర్షికతో నిర్వహిస్తున్న కవి సమ్మేళనంలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంపై కవిత గానం చేస్తారు. రెండవ రోజు నిర్వహించబోయే అంతర్జాతీయ సాహితీరంగ ప్రతినిధుల సదస్సులో పాల్గొని “కథా సాహిత్యం పై ప్రపంచీకరణ ప్రభావం” అనే అంశంపై ప్రసంగించి పత్ర సమర్పణ చేస్తారు. సాహిత్య, సంగీత, సాంస్కృతిక, పరిశోధన, కళా రంగాలలో గౌరీ నాయుడు చేస్తున్న కృషికి గుర్తింపుగా అరుదైన గౌరవం లభించింది. ఈ సందర్భంగా సాహితీ మిత్రులు, స్నేహితులు, కళాకారులు, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు గౌరీ నాయుడుకి అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు, హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీ ఉద్దండ పండితులు, ప్రఖ్యాత కవులు, సుప్రసిద్ధ రచయితలు ఈ మహాసభలలో పాల్గొంటున్నారని గౌరీ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అవకాశం కల్పించిన కార్యనిర్వాహక వర్గ సభ్యులకు గౌరీ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.