హైదరాబాదులోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కలుషిత ఆహారం వడ్డిస్తున్నట్టు ఇప్పటికే పలుమార్లు గుర్తించారు. అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొన్ని రెస్టారెంట్ల తీరు మారడంలేదు.
తాజాగా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బావర్చి హోటల్ లో చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు దర్శనమిచ్చాయి. దాంతో కస్టమర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు… బిర్యానీలో ట్యాబ్లెట్లు ఉండడాన్ని వీడియో తీసే ప్రయత్నం చేయగా… హోటల్ యాజమాన్యం అడ్డుకుంది. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఇదే హోటల్ లో ఇటీవల బిర్యానీలో సిగరెట్ పీకలు దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బిర్యానీలో మాత్రలు కనిపించగా, అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.
గత ఆర్నెల్ల కాలంలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు జరిపి కొన్ని చోట్ల కేసులు నమోదు చేశారు. కొన్ని రెస్టారెంట్లకు జరిమానాలు కూడా విధించారు.