కడప జిల్లా : కడప మున్సిపల్ స్కూల్ లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని… అందుకే ఇక్కడ అన్ని సమస్యలు తీరిపోయి ఉంటాయని తాను భావించానని చెప్పారు. కానీ కడప పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదని వ్యాఖ్యానించారు.
పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు ఇచ్చామని పవన్ తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. తాగునీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాయలసీమ అంటే వెనకబడిన ప్రాంతం కాదని… అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన గడ్డ రాయలసీమ అని అన్నారు