contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేసీఆర్ ఏనాడైనా ప్రతిపక్ష పాత్రను పోషించారా .. ? రేవంత్ కామెంట్స్

కేసీఆర్ ఏనాడైనా ప్రతిపక్ష నేతగా తన పాత్రను పోషించారా? బీఆర్ఎస్ హయాంలో తమ ఎమ్మెల్యేలను లాక్కుంటే వెనుకడుగు వేయకుండా పోరాడామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం… ఓడితే కుంగిపోవడం కేసీఆర్ స్థాయికి తగదన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉండి ఎంపీగా గెలిచానన్నారు. కానీ కేసీఆర్ ఒక్కసారి ఓడిపోతే కుంగిపోయి ఫాంహౌస్‌లోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. నల్గొండలో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ గాలి బ్యాచ్‌ను తమ పైకి వదిలి వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వద్దంటున్నారని, అలా చేస్తే తెలంగాణ ముందుకు ఎలా వెళుతుందని ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని… రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు లబ్‌డబ్ అంటూ కొట్టుకోవాలన్నారు. రైతులు సన్నాలు పండించాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మూసీ ప్రక్షాళన చేస్తానంటే బీఆర్ఎస్ నాయకులు వద్దంటున్నారని, కానీ అనుభవం కలిగిన కేసీఆర్ ఈ అంశంపై తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రక్షాళన వద్దంటే బొంద పెడతారని హెచ్చరించారు.

కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌కు సూచన

బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌కు తాను ఒక్కటే మాట చెబుతున్నానని, మీరు మారాలని, ఆలోచన చేయాలని సూచించారు. ఆ దొంగల దోస్తీ చేస్తే… ఆ దొంగల మాటలు పట్టుకుంటే మీరు కూడా అలాగే తయారవుతారన్నారు. మీరు దొంగల బండి ఎక్కితే మీపై ఉన్న గౌరవం కూడా పోతుందన్నారు. ఏడాది పాలనలోనే తాము రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ప్రధాని మోదీ కానీ, కేసీఆర్ కానీ అలా చేశారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారి నల్గొండ జిల్లాకు చెందిన వాడేనన్నారు. నల్గొండలో అడుగుపెట్టినప్పుడు సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకువస్తుందన్నారు. నల్గొండలో కృష్ణాజలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో నిలిచిపోయాయని విమర్శించారు.

ఉమ్మడి ఏపీ పాలనలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండకు ఎక్కువ అన్యాయం జరిగిందని మండిపడ్డారు. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొచ్చి నేలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని కేసీఆర్ గతంలో అన్నారని, కానీ తాము మాత్రం మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. మూడ్రోజుల్లోనే రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అత్యధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :