contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. కేటీఆర్‌, హ‌రీశ్‌రావు అరెస్ట్

హైదరాబాద్ : సీఎం రేవంత్‌-అదానీ ఫొటో ముద్రించిన టీష‌ర్టుల‌తో అసెంబ్లీలోకి అనుమ‌తించ‌క‌పోవ‌డంపై బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ గేటు వ‌ద్ద నిర‌సన‌కు దిగారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర స‌ర్కార్‌ తీరుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మ‌రో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. రేవంత్‌-అదానీ బొమ్మ ఉన్న‌ టీష‌ర్టుల‌తోనే అసెంబ్లీలోకి వెళ్తామ‌ని తేల్చి చెప్పారు. దాంతో కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, ఇత‌ర బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

అంత‌కుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. పార్ల‌మెంట్‌కే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు అదానీ ఫొటో ఉన్న టీష‌ర్టులు ధ‌రించి వెళ్లార‌ని అన్నారు. ల‌గ‌చ‌ర్ల ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిర‌స‌న తెలిపేందుకు స‌భ‌కు వెళ్తున్నామ‌న్న కేటీఆర్‌.. బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడుతామ‌ని తెలిపారు. న‌డిరోడ్డుపై ఎమ్మెల్యేల‌ను అడ్డుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీలో కుస్తీ.. గ‌ల్లీలో దోస్తీ క‌డుతున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. అదానీకి కాంగ్రెస్ నేత‌లు దాసోహం అంటున్నార‌ని ఆరోపించారు.

మ‌రోవైపు హ‌రీశ్‌రావు కూడా ప్ర‌భుత్వ తీరుప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదానీ ఫొటో ఉన్న టీష‌ర్టులు వేసుకుని ఢిల్లీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేతలు పార్ల‌మెంట్‌కు వెళ్లారు. వారు వెళ్తే ప‌ర్వాలేదు. రాష్ట్రంలో మేము నిర‌స‌న తెలుపుతూ టీష‌ర్టులు ధ‌రిస్తే వ‌చ్చిన ఇబ్బంది ఏంటో తెలియ‌డం లేద‌న్నారు.

రాహుల్‌గాంధీకి ఒక నీతి.. రేవంత్ రెడ్డికి మ‌రో నీతి ఉంటుందా అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు లేకుండా చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్‌పై కుట్ర‌తో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని మార్చార‌ని ఈ సందర్భంగా హరీశ్‌రావు ఆరోపించారు. కొత్త విగ్ర‌హంలో బ‌తుక‌మ్మ‌ను తొలగించ‌డం అనేది తెలంగాణ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇది అవ‌మానంగా ఆయ‌న పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :