న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ మొదలుకాక ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) పాజిటీవ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఐపీఎల్ పాలక మండలి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి మ్యాచ్‌లు, ఆటలకు సంబంధించిన ఈవెంట్లు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజల సమూహాలు ఎక్కువగా ఉంటే ప్రాణాంక కోవిడ్19 (COVID-19) త్వరగా వ్యాపిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేశంలో దాదాపు 80 కోవిడ్19 పాజిటీవ్ కేసులు నమోదు కాగా, ఒకరు చనిపోయారు. ముగ్గురు కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.కాగా, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఐపీఎల్ నిర్వహణకు అడ్డు చెబుతున్నాయి. తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ నిర్వహించకూదని నిర్వాహకులకు సూచించాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా వీరిదారిలోనే ఢిల్లీ ప్రభుత్వం పయనిస్తూ ఐపీఎల్ సహా అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 29న ఐపీఎల్ సీజన్ 13 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ సొంత వేదిక ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్‌లు ఆడనుంది.