ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి పూణెలోని శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఫొటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని వూహాన్ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఇది అచ్చం ‘మెర్స్-కోవ్’ వైరస్‌ను పోలి ఉంది. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం.